గలతీయులకు వ్రాసిన లేఖ 3:6-14

గలతీయులకు వ్రాసిన లేఖ 3:6-14 TERV

అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.” కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!” అని ముందే చెప్పాడు. కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు. ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు” అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు” అని వ్రాయబడి ఉంది. “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!” అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.