అపొస్తలుల 5:17-26

అపొస్తలుల 5:17-26 TERV

సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని చెప్పారు. ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు. ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచినవాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.

అపొస్తలుల 5:17-26 కోసం వీడియో