అపొస్తలుల 4:13-31

అపొస్తలుల 4:13-31 TERV

పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు. వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.” వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు. వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు: ‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి? ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు? ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును, ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’ హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!” వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.

అపొస్తలుల 4:13-31 కోసం వీడియో