అపొస్తలుల 3:1-11

అపొస్తలుల 3:1-11 TERV

ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు. పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ, అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు. ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు.

అపొస్తలుల 3:1-11 కోసం వీడియో