రోమా పత్రిక 2:17-29

రోమా పత్రిక 2:17-29 IRVTEL

నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా? ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి, బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా? ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా? ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా? “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా. నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా? సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా? పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.

రోమా పత్రిక 2:17-29 కోసం వీడియో