కీర్తన 18:37-50

కీర్తన 18:37-50 IRVTEL

నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు. వాళ్ళు లేవలేనంతగా వాళ్ళను చితకగొట్టాను. వాళ్ళు నా కాళ్ళ కింద పడ్డారు. యుద్ధానికి కట్టిన దట్టీలా నువ్వు నాకు బలం ధరింపజేశావు. నా మీదికి లేచిన వాళ్ళను నువ్వు నా కింద పడేశావు. నా శత్రువుల మెడ వెనుకభాగం నువ్వు నాకు అప్పగించావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను పూర్తిగా నాశనం చేశాను వారు సాయం కోసం మొరపెట్టారు గాని వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు గాని ఆయన వాళ్లకు జవాబివ్వలేదు. అప్పుడు గాలికి ఎగిరే దుమ్ములాగా నేను వాళ్ళను ముక్కలుగా కొట్టాను. వీధుల్లో మట్టిని విసిరేసినట్టు విసిరేశాను. ప్రజల కలహాల నుంచి నువ్వు నన్ను కాపాడావు. జాతులకు నన్ను సారధిగా చేశావు. నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు. నా గురించి వినగానే వాళ్ళు నాకు లోబడుతున్నారు. పరదేశులు బలవంతంగా నాకు సాష్టాంగపడ్డారు. తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు. యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక. ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు. అందువల్ల యెహోవా, జాతులలో నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నీ నామానికి స్తుతుల కీర్తన పాడతాను! దేవుడు తన రాజుకు గొప్ప జయం ఇస్తాడు. తాను అభిషేకించిన వాడికి, దావీదుకు అతని సంతానానికి, శాశ్వతంగా ఆయన తన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తాడు.