సామెత 3:1-10
సామెత 3:1-10 IRVTEL
కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు. అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి. అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో. అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు. నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో. ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు. అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి. యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు. అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

