సంఖ్యా 20:14-20

సంఖ్యా 20:14-20 IRVTEL

మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు. మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం. మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం” అని చెప్పించాడు. కాని ఎదోము రాజు “నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను” అని జవాబిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో “మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే” అన్నారు. అప్పుడు అతడు “నువ్వు రాకూడదు” అన్నాడు. అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు.