మత్తయి 6:7-15
మత్తయి 6:7-15 IRVTEL
అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు. కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక. నీ రాజ్యం వస్తుంది గాక. పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక. మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి. మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు. మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.” “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.







