మత్తయి 2:7-15
మత్తయి 2:7-15 IRVTEL
అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు. తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు. వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు. హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు. ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’ అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.




