మత్తయి 18:10-20
మత్తయి 18:10-20 IRVTEL
10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు. “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా? అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు. “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు. “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు. “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”

