మత్తయి 13:1-12

మత్తయి 13:1-12 IRVTEL

ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ, ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి. చెవులున్నవాడు విను గాక!” అన్నాడు. తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు. కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది.