యోబు 28:12-28

యోబు 28:12-28 IRVTEL

అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది. బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు. అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు. సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము. పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది. కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము. అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం. “మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి. దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు. ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు. గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు, వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు, ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు. యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.