ఆది 4:1-15

ఆది 4:1-15 IRVTEL

ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు. కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు. యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు. కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు. అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు. దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది. ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు. నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు. కయీను “నా శిక్ష నేను భరించలేనిది. ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు. యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.

ఆది 4:1-15 కోసం వీడియో