ఆది 2:15-25
ఆది 2:15-25 IRVTEL
దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు. ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు. ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.

