ఆది 19:15-22

ఆది 19:15-22 IRVTEL

ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. “రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు” అన్నారు. అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు. ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకు వచ్చిన తరువాత వాళ్ళలో ఒకడు “మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపొండి. వెనక్కు తిరిగి చూడవద్దు. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు. మీరు తుడిచి పెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి” అని చెప్పాడు. అప్పుడు లోతు “ప్రభువులారా, అలా కాదు. మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో. చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది గదా, నేను బతుకుతాను” అన్నాడు. అప్పుడు ఆయన “అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను. నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను” అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.

ఆది 19:15-22 కోసం వీడియో