గలతీ పత్రిక 3:15-29
గలతీ పత్రిక 3:15-29 IRVTEL
సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు. అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే. నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు. అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు. మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది. మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది. అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

