దాని 9:1-10

దాని 9:1-10 IRVTEL

మాదీయుడైన అహష్వేరోషు కుమారుడు దర్యావేషు కల్దీయులపై రాజయ్యాడు. అతని పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలు అనే నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయాకు ఇచ్చిన వాక్కు రాసి ఉన్న గ్రంథాలు చదువుతున్నాను. యెరూషలేము విడిచిపెట్టబడిన స్థితిలో ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి కావచ్చాయని గ్రహించాను. అప్పుడు నేను గోనెపట్ట కట్టుకుని, ఉపవాసముండి, ధూళిలో కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన దేవుని వైపుకు నా ముఖం తిప్పుకున్నాను. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి మా పాపాలు ఒప్పుకున్నాను. “ప్రభూ, మహాత్మ్యం, మహా శక్తి గల దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి పట్ల నీ నిబంధనను నీ కృపను నీవు జ్ఞాపకం చేసుకుంటావు. మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము. నీ దాసులైన ప్రవక్తలు నీ నామాన్ని బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పూర్వికులకు, యూదయ దేశప్రజలందరికి చెప్పిన మాటలు మేము వినలేదు. ప్రభూ, నీవే నీతిమంతుడవు. మేము నీ మీద తిరుగుబాటు చేశాము. యెరూషలేములో, యూదయ దేశంలో నివసిస్తున్న వారందరి ముఖాలకు, ఇశ్రాయేలీయులందరి ముఖాలకు సిగ్గే తగినది. నీవు చెదరగొట్టిన స్వదేశవాసులకు, పర దేశవాసులకు ఇదే శాస్తి. మేము నీ పట్ల చేసిన గొప్ప నమ్మక ద్రోహానికి ఇదే శిక్ష. ప్రభూ, నీకు విరోధంగా పాపం చేసినందున మాకు, మా రాజులకు, మా అధికారులకు, మా పూర్వీకులకు ముఖం చిన్నబోయేలా సిగ్గే తగినది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేశాము. అయితే ఆయన కృప, క్షమాగుణం ఉన్న దేవుడు. ఆయన తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పాడు. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు.