అపొస్తలుల కార్యములు 3:1-11

అపొస్తలుల కార్యములు 3:1-11 IRVTEL

మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు. పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు. పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు. అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు. ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు. వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.

అపొస్తలుల కార్యములు 3:1-11 కోసం వీడియో