అపొస్తలుల కార్యములు 20:15-38
అపొస్తలుల కార్యములు 20:15-38 IRVTEL
అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకుని ఆ తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం. సాధ్యమైతే పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియలో కాలయాపన చేయకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు. వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు. యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు. మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను. అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు. “ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు. కానీ, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్షమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు. ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు. కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు. “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు. అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి. ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి. నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.” అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.

