2 సమూ 3:1-21
2 సమూ 3:1-21 IRVTEL
సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు. రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు. మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు. నాలుగవ వాడు అదోనీయా హగ్గీతుకు పుట్టాడు. అయిదవ వాడు షెఫట్య అబీటలుకు పుట్టాడు. ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు. రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు “నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు” అని అబ్నేరును ప్రశ్నించాడు. ఇష్బోషెతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు “నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికీ, అతని సహోదరులకూ, అతని స్నేహితులకూ నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి, ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా? యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడు గాక. సౌలు కుటుంబం వారి చేతిలోనుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను” అన్నాడు. అబ్నేరు మాటలకు భయపడిన ఇష్బోషెతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి “ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను” అని కబురు పంపాడు. అప్పుడు దావీదు “మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలును నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే నీకు నా దర్శనం దొరకదు” అని జవాబిచ్చాడు. దావీదు సౌలు కొడుకు ఇష్బోషెతు దగ్గరికి తన మనుషులను పంపించి “ఫిలిష్తీయుల్లో వందమంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకొన్న మీకాలును నాకు అప్పగించాలి” అని చెప్పమన్నాడు. మీకాలు భర్త, లాయీషు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకు వచ్చేందుకు ఇష్బోషెతు తన మనుషులను పంపించాడు. ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు “నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో” అని చెప్పగానే అతడు వెళ్లిపోయాడు. అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి “దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకు ముందు కోరుకున్నారు గదా? ‘నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను’ అని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాడు కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి” అని వారితో చెప్పాడు. అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు. అందుకోసం అబ్నేరు ఇరవైమందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకి వచ్చాడు. దావీదు అబ్నేరుకు, అతని మనుషులకు విందు చేయించాడు. అప్పుడు అబ్నేరు “నేను వెళ్లి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి, వారు నీతో ఒప్పందం చేసేలా, నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్నదాని అంతటినీ పాలించేలా చేస్తాను” అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్లిపోయాడు.

