2 సమూ 16:5-13
2 సమూ 16:5-13 IRVTEL
రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు. అతడు దావీదు పక్కనే నడుస్తూ “నరహంతకుడా, దుర్మార్గుడా ఛీ పో, ఛీ పో. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబంవారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు. నీ కుమారుడు అబ్షాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు” అని దుర్భాషలాడుతూ వచ్చాడు. రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు. అప్పుడు సెరూయా కుమారుడు అబీషై “ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను” అన్నాడు. అందుకు రాజు “సెరూయా కొడుకుల్లారా, మీకు నామీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతణ్ణి శపించయ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగేవాళ్ళెవరు?” అని చెప్పాడు. తరువాత అబీషైతో, తన సేవకులందరితో, ఇలా చెప్పాడు. “నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి. యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులు నాకు మేలు చేస్తాడేమో.” తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.

