దావీదు “బత్షెబను పిలవండి” అని ఆజ్ఞాపించాడు. ఆమె రాజు సన్నిధికి తిరిగి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా “అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, ‘తప్పకుండా నీ కొడుకైన సొలొమోను నా తరవాత నాకు బదులుగా నా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలిస్తాడని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామం తోడు’ అని నేను నీకు మునుపు ప్రమాణం చేసిన దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను” అని చెప్పాడు. అప్పుడు బత్షెబ సాష్టాంగపడి రాజుకు నమస్కారం చేసి “నా యజమాని, రాజు అయిన దావీదు చిరకాలం జీవిస్తాడు గాక” అంది. అప్పుడు రాజైన దావీదు “యాజకుడు సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి పిలవండి” అని ఆజ్ఞాపించాడు. వారు రాజు ఎదుటికి వచ్చారు. రాజు “మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకు వెళ్ళి నా కొడుకు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకు వెళ్ళండి. యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరవాత మీరు బాకాలు ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి’ అని ప్రకటన చేయాలి. తరువాత, ఇశ్రాయేలు వారి మీదా యూదా వారి మీదా నేను అతణ్ణి అధికారిగా నియమించాను. కాబట్టి మీరు యెరూషలేముకు అతని వెంట రావాలి. అతడు నా సింహాసనం మీద కూర్చుని నా స్థానంలో రాజవుతాడు” అని ఆజ్ఞాపించాడు. అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు ఈ విధంగా జవాబిచ్చాడు. “ఆ విధంగానే జరుగుతుంది గాక, నా యజమానివీ రాజువీ అయిన నీ దేవుడు యెహోవా ఆ మాటను స్థిరపరుస్తాడు గాక. యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు సొలొమోనుకు కూడా తోడుగా ఉండి, నా యజమానివీ రాజువీ అయిన నీ రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనమైనదిగా చేస్తాడు గాక.” కాబట్టి యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గిహోనుకు తీసుకు వచ్చారు. సాదోకు గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా ప్రజలంతా “రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి” అని కేకలు వేశారు. ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ, వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు. అదోనీయా, అతనితో ఉన్న అతిథులూ విందు ముగిస్తూ ఉండగా ఆ కోలాహలం వారికి వినబడింది. యోవాబు ఆ బాకానాదం విని “పట్టణంలో ఈ సందడి ఏమిటి?” అని అడిగాడు. అంతలో, యాజకుడు అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా “లోపలికి రా, నీవు యోగ్యుడివి. మంచి వార్తతో వస్తావు” అన్నాడు. అప్పుడు యోనాతాను అదోనీయాతో “మన యజమాని, రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు. రాజు యాజకుడైన సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతీయులనూ పెలేతీయులనూ అతనితో పంపాడు. వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు. యాజకుడైన సాదోకూ ప్రవక్త నాతానూ గిహోనులో అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడి నుండి వారు సంతోషంగా తిరిగి వచ్చారు. అందువలన పట్టణం కోలాహలంగా ఉంది. మీకు వినబడిన శబ్దం అదే. అంతేగాక సొలొమోను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. పైగా రాజు సేవకులు తమ యజమాని, రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. ‘దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడు గాక’ అని చెప్పారు. అప్పుడు రాజు మంచం మీదే సాష్టాంగపడి నమస్కారం చేసి ‘నేను బతికి ఉండగానే ఈ రోజు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా సింహాసనం మీద కూర్చోడానికి నాకు ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను కళ్లారా చూశాను. ఆయనకు స్తుతి కలుగు గాక’ అన్నాడు” అని యోనాతాను చెప్పాడు. అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు. అదోనీయా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అదోనీయా బలిపీఠం కొమ్ములు పట్టుకుని “రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తితో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి” అని వేడుకుంటున్నాడని సొలొమోనుకు వార్త వచ్చింది. అందుకు సొలొమోను “అతడు తనను నిర్దోషిగా కనపరచుకోగలిగితే అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. కాని అతడు దోషి అని తేలితే అతనికి మరణశిక్ష తప్పదు” అని చెప్పి, బలిపీఠం దగ్గర నుండి అతణ్ణి పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడినపుడు సొలొమోను అతనితో “ఇక నీ ఇంటికి వెళ్ళు” అన్నాడు.
చదువండి 1 రాజులు 1
వినండి 1 రాజులు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 రాజులు 1:28-53
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు