నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువువారి కపటాలోచన మోసమే. భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
చదువండి కీర్తనలు 119
వినండి కీర్తనలు 119
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 119:81-120
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు