కీర్తనలు 119:73-88

కీర్తనలు 119:73-88 TELUBSI

నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము.