కీర్తనలు 119:57-80

కీర్తనలు 119:57-80 TELUBSI

యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను. నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాటచొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను. నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.