కీర్తనలు 119:41-56

కీర్తనలు 119:41-56 TELUBSI

యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ గలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను. నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను. యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.