కీర్తనలు 107:1-43

కీర్తనలు 107:1-43 TELUBSI

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు వారిని రప్పించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు. భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక. ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయనచేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరివారు ఎటుతోచక యుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరివారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక దేశనివాసుల చెడుతనమునుబట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనినవారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు. అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.