సామెతలు 25:1-14

సామెతలు 25:1-14 TELUBSI

ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. –సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును. రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధానియెదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటె –ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి–దాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము. బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును. కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.