సామెతలు 22:14-29

సామెతలు 22:14-29 TELUBSI

వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును. లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయముచేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతోమంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను? నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవావారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము. చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల? నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.