ఫిలిప్పీయులకు 1:19-30

ఫిలిప్పీయులకు 1:19-30 TELUBSI

మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును. నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితోకూడ కలిసియుందునని నాకు తెలియును. నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీ రిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.