సంఖ్యాకాండము 33:50-56

సంఖ్యాకాండము 33:50-56 TELUBSI

యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నతస్థలములనన్నిటిని పాడుచేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.