సంఖ్యాకాండము 26:52-65

సంఖ్యాకాండము 26:52-65 TELUBSI

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను; తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమతమపితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవావారినిగూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.