తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి. అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. కాబట్టి –యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది. అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి– బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి–మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలి మేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు– హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటిమీద గురిపెట్టి కొట్టితిమి దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితిమి. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషానురాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను–అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.
చదువండి సంఖ్యాకాండము 21
వినండి సంఖ్యాకాండము 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సంఖ్యాకాండము 21:10-35
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు