సంఖ్యాకాండము 14:11-23

సంఖ్యాకాండము 14:11-23 TELUBSI

యెహోవా–ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారిమధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లనెను–ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజలమధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు –ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవావారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను. అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు.