సంఖ్యాకాండము 14:1-10

సంఖ్యాకాండము 14:1-10 TELUBSI

అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. ఆ సర్వసమాజము–అయ్యో ఐగుప్తులో మేమేల చావ లేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి. వారు–మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజసంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము. మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికి కనబడెను.