నెహెమ్యా 4:10-23

నెహెమ్యా 4:10-23 TELUBSI

అప్పుడు యూదావారు – బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా, మా విరోధులును – వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి–నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని. అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను. అయితే అప్పటినుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆయా యింటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటిని–పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును. ఆప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో– ప్రతివాడు తన పనివానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని. ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.