నెహెమ్యా 10:27-39

నెహెమ్యా 10:27-39 TELUBSI

అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు–మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనేగాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి. సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించు కొంటిమి. మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడు వారితోకూడ ఉండ వలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి, ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.