అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి–నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, వాడు కన్నులెత్తి – మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. అప్పుడు యేసు–నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా– నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడుదినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి–సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్క రింపకున్నావని పేతురును గద్దించెను. అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి–నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబ డింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును? వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధదూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.
చదువండి మార్కు 8
వినండి మార్కు 8
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 8:22-38
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు