మార్కు 5:35-43

మార్కు 5:35-43 TELUBSI

ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి లోపలికిపోయి– మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చెయిపెట్టి– తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.