మీకా 7:1-7

మీకా 7:1-7 TELUBSI

వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్లగెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమునకిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోను కీడుచేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగునవారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు. అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.