మత్తయి 9:18-38
మత్తయి 9:18-38 TELUBSI
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ. –నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి –కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి. –స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి–దావీదు కుమారుడా, మమ్మును కనిక రించుమని కేకలువేసిరి. ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు–ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి. యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపెట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి–ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి. అయితే పరిసయ్యులు–ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి – కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.

