మత్తయి 4:17-25

మత్తయి 4:17-25 TELUBSI

అప్పటినుండి యేసు పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.