మత్తయి 27:57-66

మత్తయి 27:57-66 TELUBSI

యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి –అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి –ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు–కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 27:57-66 కు సంబంధించిన వాక్య ధ్యానములు