మత్తయి 26:47-56

మత్తయి 26:47-56 TELUBSI

ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.