మత్తయి 22:1-10

మత్తయి 22:1-10 TELUBSI

యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు–ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు–పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.