ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా – యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
చదువండి మత్తయి 21
వినండి మత్తయి 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 21:18-27
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు