మత్తయి 16:13-23

మత్తయి 16:13-23 TELUBSI

యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.