మత్తయి 11:7-15
మత్తయి 11:7-15 TELUBSI
వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను –మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో–సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.– ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. వినుటకు చెవులుగలవాడు వినుగాక.

