మత్తయి 10:1-15

మత్తయి 10:1-15 TELUBSI

ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను. ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింప కుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.